Politics

బాబుకు భద్రతగా ఎంతమంది పోలీసులో తెలుసా..!

తమ అధినేత చంద్రబాబుకు భద్రత తగ్గించారంటూ తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. తెగ బాధపడుతున్నారు. తమ అధినేతకు ఏదో జరుగుతుందంటూ.. మరేదో జరగబోతుందంటూ..ఆగమాగం.. ఆగమ్యగోచరంగా మాట్లాడుతున్నారు. అయితే.. చంద్రబాబుకు భద్రత తగ్గించారంటూ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది..?  నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందా..?  అన్న విషయాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు.. ఆయన ప్రతిపక్ష నేత. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా.. ఆయనకు ప్రత్యేక కేటగిరీలో భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఇప్పటి వరకు ఎవ్వరికి సరైన క్లారిటీ లేకపోవడంతో టీడీపీ వాళ్లు చంద్రబాబుకు ప్రభుత్వం భద్రత తగ్గించేసిందంటూ గాసిప్ ప్రచారాన్ని బాగా హైలెట్ చేస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ ఓ కన్ ఫ్యూజ్ నెలకొంది. ఇక డీజీపీ గౌతం సవాంగ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.ఇదే విషయాన్ని మంగళవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు భద్రత తగ్గించారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.  “చంద్రబాబు ఇంకా తాను ముఖ్యమంత్రినే అని భ్రమపడుతున్నారు. ప్రతిపక్ష నేత అన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ – ఎస్కార్ట్ కార్లు ఇచ్చాం. భద్రతా సమీక్ష కమిటీ చెప్పిన దానికంటే ఎక్కువ భద్రతే ఆయనకు కల్పించాం. నిజానికి.. చంద్రబాబు భద్రతకు 58 మందినే కేటాయించాలి.. కానీ ఆయనకు రక్షణగా 74 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు“ అని హోంమంత్రి స్పష్టం చేశారు. అంటే.. బాబుగారికి ఎక్కడ కూడా భద్రత తగ్గించలేదన్నమాట.మరి తెలుగు తమ్ముళ్లు ఎందుకింతగా గగ్గోలు పెడుతున్నారని అనుకుంటున్నారా..? ఇందులో ఏమీ లేదు.. తమ అధినేత చంద్రబాబుపై జనంలో సానుభూతిని పెంచడం కోసమేనని అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిని చవిచూసింది. ఏకంగా ముఖ్యమంత్రి కూడా కష్టాతికష్టంగా గెలిచారు. ఇక ఆయన కుమారుడు లోకేశ్ ఓడిపోయారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ – బాబు అండ్ కో పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి సమయంలో భద్రత తగ్గించారన్న పేరుతో సానుభూతి రాజకీయం మొదలు పెట్టారనే విమర్శలు సామాన్య ప్రజల నుంచే వినిపించడం గమనార్హం. ఇప్పటకి అయినా ప్రజల కోసం నిర్మాణాత్మకమైన పోరాటం చేయకపోతే టీడీపీ మరింత అధోఃగతి పాలవ్వడం ఖాయం. మరి తెలుగు తమ్ముళ్లు ఎప్పుడు రూటు మార్చుకుంటారో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *