Politics

ఎగ్జిట్‌పోల్స్‌లో నిజమెంత.. గతంలో ఏమైంది?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ డిసెంబరు 7తో ముగిసింది. డిసెంబరు 11న ఇక ఫలితాల వెల్లడే తరువాయి. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 12, 20 తేదీల్లో రెండు దశలుగా ఎన్నికలు జరగ్గా… నవంబరు 28న మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌ నిర్వహించారు. రాజస్థాన్‌, తెలంగాణాలకు డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. దీంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

శుక్రవారం పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ- కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అనే స్థాయిలో ఉందని, తెలంగాణలోనూ టీఆర్ఎస్ మరోసారి అధికారంలో వస్తుందని జాతీయ సంస్థల సర్వేలు వెల్లడించాయి. అయితే వీటికి భిన్నంగా ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు గాంచిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే ఉండటంతో తీవ్ర ఉత్కంఠకు తెర తీసింది. ఈ నేపథ్యంలో గత ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజమయ్యాయి? వీటిలో ఏ సంస్థ ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలిగాయన్నది మరోసారి చర్చనీయాంశమైంది.

2013లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికల సందర్భంగానూ, ఇటీవలి కర్ణాటక శాసనసభ ఎన్నికలప్పుడూ పలు సంస్థలు అంచనాలను విడుదల చేశాయి. వాటిలో కొన్ని ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. ఈ రాష్ట్రాల విషయంలో అప్పట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెప్పాయి, ఫలితాలు ఎలా ఉన్నాయన్నది ఇప్పటికీ ఆసక్తికరమే!. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ వెల్లడించిన సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. అయితే, 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌పోల్స్ మాత్రం తల్లకిందులయ్యాయి. భారత్ వెలిగిపోతుందంటూ నాటి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రచారం ఓటర్లు నమ్మలేదు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ 250 నుంచి 280 వరకు సీట్లను సాధిస్తుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. కానీ కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి 220 సీట్లను చేజిక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *