Politics

జగన్ సంచలన నిర్ణయం…డైలమాలో వైసీపీ నేతలు

నిన్నమొన్నటి వరకు వారంతా కొంత ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అయినా అందలం దక్కకపోతుందా అన్న ఆశతో పనిచేస్తున్నారు. దీనికితోడు తమ పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్ర తమకు కలిసివస్తుందని ఒకింత సంబరపడ్డారు. అయితే ఇటీవల పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో వారంతా డీలాపడిపోయారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. రానున్న ఎన్నికల్లో పార్టీ మట్టికరవడం ఖాయమని లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ పార్టీ నేతల్లో ఆందోళన ఎందుకు అంతలా పెరిగింది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే విశాఖ సాగరతీరానికి వెళ్లాల్సిందే!యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాన్ని విశాఖపట్టణం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలోని మెజారిటీ నేతలు, కార్యకర్తలు తప్పుబడుతున్నారు. “ఇలాంటి చెత్త సలహాలు జగన్‌కి ఎవరు ఇస్తున్నారో?” అని వారు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అడుగడుగునా అడ్డుపడుతున్న తెలంగాణ రాష్ట్రసమితితో కలిసి పనిచేయాలన్న జగన్ నిర్ణయాన్ని వారంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా వైసీపీకి ఎంతోకొంత మైలేజీ తెచ్చిన జగనే ఇప్పుడు తన తాజా నిర్ణయంతో అదే పార్టీకి చేటు తెస్తున్నారని వారు ఆవేశంగా చెబుతున్నారు.

జగన్ నిర్ణయం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ఏపీ పట్ల ద్వేషం ప్రదర్శించే టీఆర్‌ఎస్‌ వైఖరిని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.ఉమ్మడి రాష్ట్ర విభజన కారకుడు కేసీఆర్ అని ఏపీ ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విభజన అనివార్యమే అనుకున్నప్పటికీ, అడ్డగోలుగా చేసిన విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని మాత్రం ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అంతేకాదు- తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుతల్లిని, ఆంధ్రులను ఘోరాతిఘోరంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవమానించిన తీరును ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు మననం చేసుకుంటున్నాయి. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ గళమెత్తుతున్న విధానాన్ని కూడా ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.విభజన సమయంలో ఏపీకిచ్చిన ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదా రాకపోవడానికి టీఆర్‌ఎస్ కూడా ఒక కారణమని వైసీపీ నేతలే గట్టిగా అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం ఆంధ్రా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతుంటే.. ఆ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించిన వైఖరిని ఎలా మరిచిపోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేతలు గతంలో చేసిన ప్రకటనలు ఆంధ్ర ప్రజల గుండెల్లో మంటలు రేపాయని కూడా వారు చెబుతున్నారు.ఇలా ఏ కోణంలో చూసినా ఏపీ పట్ల టీఆర్‌ఎస్‌ ప్రతీకారంతోనే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో మెజారిటీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పార్టీతో వైఎస్‌ జగన్‌ చేతులు కలపడం అంటే.. కోరి మరీ విపత్తును కొనితెచ్చుకోవడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గనుక టీఆర్‌ఎస్‌తో చేయి కలిపి వెళితే.. తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రచారం చేసుకోకపోయినా గెలుస్తుందని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ తన నిర్ణయాన్ని సమీక్షించుకోకపోతే… వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కొందరు చురకలంటిస్తున్నారు కూడా!వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల ఆవేదనలో అర్థముందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో ఆ పార్టీకి ప్రజాదరణ ఎంతోకొంత పెరిగింది. అన్ని రోజులపాటు యాత్ర చేయడం ద్వారా సాధించిన ఆ మైలేజీ అంతా.. కేటీఆర్‌తో జగన్‌ భేటీ వల్ల పటాపంచలు అయ్యిందని వైకాపా నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీ అధినేత నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో చేయి కలపడాన్ని వైసీపీలో అతి కొద్దిమంది మాత్రమే స్వాగతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్‌ నిర్ణయం పట్ల ప్రజాస్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *