Politics

యూట్యూబ్ కామెంట్స్ చదివి సిఎం అవుతానంటున్న పాల్ !

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు.మంగళవారం సీపీని కలిసిన కేఏ పాల్ తనపై చేస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్‌ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న కామెడీ క్లిప్పింగులను ఆయనకు అందించారు. మొత్తంగా వంద యూట్యూబ్ చానళ్లు, కొన్ని వెబ్‌సైట్లు, కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుస్తానని తెలిపారు. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో తనపై ఉన్న పాత కేసులను తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పాల్ ఆరోపించారు.త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, వైకాపా, జనసేనలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతుంటే మధ్యలో ప్రజాశాంతి పార్టీ కూడా ఎంటరైంది. ఆ పార్టీ ఆధ్యక్షుడు కేఏ పాల్ ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి హడావుడి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అవుతానంటున్న ఆయన పవన్ కూడా తనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.పలు ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ చంద్రబాబు, వైఎస్ జగన్ లకు డిపాజిట్లు కూడా దక్కవని, అంతలా తన హవా కనిపిస్తుందని అంటున్న ఆయన మాటల్ని జనాలు సీరియస్ గా తీసుకుంటున్నారో లేదో తెలీదు కానీ కాలక్షేపానికి మాత్రం బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో ఆయనపై ట్రోలింగ్స్ బాగా ఎక్కువయ్యాయి. వాటిపై తాజాగా హైదరాబాద్ పిసి అంజనీకుమార్ కు పిర్యాదు చేశారాయన.ఆ సందర్బంగా మాట్లాడిన పాల్ తన ఇంటర్వ్యూల కింద కామెంట్లు చూస్తే నూటికి 90 మంది తనకే సపోర్ట్ చేస్తున్నారని స్పష్టమైందని, రేపటి సిఎం తానేనని అన్నారు. కేవలం యూట్యూబ్ మాధ్యమంలో వచ్చిన ఒక 90 కామెంట్లు చదివి, వాటినే ప్రమాణాలుగా తీసుకుని, అవి తనకు అనుకూలంగా ఉన్నాయని, తానే సిఎం అని కేఏ పాల్ గొప్పగా చెప్పుకోవడం వింతగానే అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *