Cinema

ఎమ్మెల్యేగా ప్రభాస్, గవర్నర్‌‌గా కృష్ణంరాజు.. బీజేపీ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బాహుబలి ఎవరు? ఇప్పటి వరకు ఆ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సూపర్ స్టార్లు లేరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అంతకు ముందు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అందరూ రాజకీయ నేతలే కానీ, సినిమా ఫీల్డ్ నుంచి సరైన కేండెట్ లేరు. అన్ని రాష్ట్రాల్లోనూ కమలనాధులకి కలర్ ఫుల్ సపోర్ట్ ఉన్నా, ఏపీలో మాత్రం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా గ్లామర్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాహుబలి స్టార్ ప్రభాస్‌ను సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా మొత్తం స్టార్ అయిపోయాడు. ఆ క్రేజ్ బీజేపీకి కూడా కనిపించింది. దీంతో ఏపీలో కూడా ప్రభాస్‌ను వాడుకుంటే బీజేపీకి జోష్ వస్తుందని, క్రౌడ్ పుల్లర్‌గా ఉపయోగపడతాడని కమలనాధులు భావిస్తున్నారు.ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు బీజేపీకి అత్యంత సన్నిహితుడు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి బీజేపీ టికెట్ మీద పోటీ చేసిన ఆయన 1,60,000 వేల తేడాతో విజయం సాధించారు. దీంతో ఆయన్ను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిని చేసింది బీజేపీ. 1999లో రెండోసారి ఎంపీగా గెలిచిన కృష్ణం రాజు మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. 2002 వరకు ఆయన కేంద్రంలో పలు శాఖలకు మంత్రి, సహాయమంత్రిగా సేవలు అందించారు. 2009లో పీఆర్పీలో చేరిన కృష్ణంరాజు, ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు.బీజేపీ నేతలు కోరుకున్నట్టు ప్రభాస్ ఆ పార్టీలో చేరితే, దానికి తగ్గట్టు కొన్ని పదవులు కూడా ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్‌ను అసెంబ్లీకి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. 1992లో కృష్ణంరాజు నర్సాపురం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. అదే సీటు నుంచి ప్రభాస్‌న పోటీ చేయించే చాన్స్ ఉన్నట్టు సమాచారం.

ప్రభాస్‌ను అసెంబ్లీ బరిలో దించాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కృష్ణంరాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ కోరుకున్నట్టు జరిగితే, కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌‌గా పంపడానికి కూడా కమలనాధులు సిద్ధమైనట్టు సమాచారం. ఈ డీల్‌కు కృష్ణంరాజు ఓకే అన్నారని, ప్రభాస్‌ ఓకే అంటారా? లేదా అనే డౌట్ ఉంది.ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో సినీ గ్లామర్‌ను ఆకట్టుకునేందుకు బీజేపీ భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తమిళనాట అజిత్‌తో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రజినీకాంత్‌తో పొత్తులకు సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. కేరళలో మోహన్ లాల్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా సినిమాగ్లామర్‌ను వినియోగించుకునేందుకు మాధురీ దీక్షిత్‌ను ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.వీరితోపాటు క్రీడా ప్రముఖులకు కూడా కమలనాధులు గాలం వేస్తున్నారు. గౌతమ్ గంభీర్‌ కూడా త్వరలో బీజేపీలో చేరతారని ఆయన చేస్తున్న ట్వీట్లను బట్టి తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *