Politics

ఏపీ ఎన్నికల్లో గెలుపు జగన్‌దే, వైసీపీకి 120 సీట్లు: అసదుద్దీన్ ఒవైసీ

తమ కంచుకోటలో మరోసారి ఎంఐఎం జెండా రెపరెపలాడుతుందనే ఆత్మవిశ్వాసం అసదుద్దీన్ ఒవైసీలో తొణికిసలాడుతోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంఐఎంఅభ్యర్థిగా పోటీ చేస్తోన్న అసదుద్దీన్ ఒవైసీ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. వినూత్న ప్రచారంతో ఒవైసీ దూసుకుపోతున్న ఆయన చేతిలో మైక్ పట్టుకుని పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కర్నీ కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీపరుడైన ప్రధాని కావాలని వ్యాఖ్యానించారు. దేశానికి కావాల్సింది చౌకీదార్‌ కాదని ఇమాందార్‌ అవసరమని అసదుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో అచ్ఛేదిన్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ఆ పని చేయలేదని, హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. పుల్వామా ఆత్మాహుతి దాడి, వైమానికి దాడుల సమయంలో కేంద్రానికి అండగా నిలిచామని, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలుగుతున్న సందర్భాల్లో పార్టీలకు అతీతంగా మద్దతిస్తున్నామని వివరించారు.

అయితే, వీటిని రాజకీయ లబ్ది కోసం బీజేపీ తన ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటే మాత్రం ప్రశ్నిస్తామని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ప్రధాని ఎవరనేది, ఇప్పుడే చెప్పలేమని, కాంగ్రెస్‌కు 150 సీట్లొస్తే రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందన్నారు. ఎన్డీయేకు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని, కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు 120 స్థానాలొస్తే ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రాంతీయ పార్టీ నేతల్లో చాలామందికి ప్రధాని అయ్యే సత్తా ఉందని తెలిపారు. అలాగే ఏపీ ఎన్నికలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సరళిని పరిశీలిస్తే జగన్‌ సీఎం కావడం ఖాయంగా అనిపిస్తోందని, ఇందుకోసం ఆయన మరింత పకడ్బందీగా ప్రచారం చేయాలని సూచించారు. వైసీపీ 20 ఎంపీ, 120 శాసనసభ స్థానాల్లో గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు హెరిటేజ్‌ వ్యాపారం చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. అలాగే బీజేపీతో జగన్‌ కలవరని భావిస్తున్నామని, ఫలితాల తర్వాత ఎన్డీయేతో ఆయన కలిస్తే సమర్థించడమా? లేదా? అన్నది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు. వైసీపీ, టీఆర్ఎస్‌లు 35కి పైగా ఎంపీ స్థానాలకు పైగా గెలుచుకుంటాయని, జగన్‌, కేసీఆర్‌లు మోదీకి బీ టీమ్ అని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. జగన్‌ ఆహ్వానిస్తే ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తానని ఒవైసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *